ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ నెల 20 తేదీన 2023 ఏడాదికి గాను ఆయనకి ఈ అవార్డ్ ని ప్రదానం చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే ఇప్పటిదాకా మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే ఈ సినిమా రంగానికి చెందిన అత్యున్నత అవార్డ్ ని పొందారు. మొదటి వ్యక్తి ప్రఖ్యాత మళయాళ దర్శకుడు ఆడూర్ గోపాల కృష్ణన్ కాగా రెండవ వ్యక్తి ప్రస్తుతం మోహన్ లాల్. అనేకమంది ఉద్ధండులైన దర్శకులు, నటులు ఉన్న ఆ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే పొందడం చాలామందిని ఆశ్చర్యపరిచే అంశం.
ఈ రోజు ఫాల్కే పురస్కారం అందుకోబోతున్న మోహన్ లాల్ తన 60 ఏళ్ళ జీవితం లో 350 కి పైగా సినిమాల్లో, అదీ వివిధ భాషలకి చెందిన సినిమాల్లో నటించారు. తమిళ, మళయాళ ఇంకా ఇతర సినీ అభిమానులు ఓ వైపు పొగడ్తలతో ముంచెత్తుతుండగా, మరో వైపు ఆయన్ని విమర్శ చేస్తున్నవారూ ఉన్నారు. 74 ఏళ్ళ మమ్మూట్టి కి దాదా సాహెబ్ ఫాల్కే ఎప్పుడో ఇవ్వవలసి వుందని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే మమ్మూట్టి మటుకు మోహన్ లాల్ కి ఫాల్కె రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశారు. తమిళ ప్రేక్షకులు కమల్ హాసన్ కి ఈ అవార్డ్ ఇంకా ఇవ్వకపోడం దారుణం అని పోస్టులు పెడుతున్నారు.
మోహన్ లాల్ విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడిగా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ,పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఆయనకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ని 2009 లో ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక దక్షిణాది నటుడు మోహన్ లాల్. కాలడి యూనివర్శిటి గౌరవ డాక్టరేట్ ని 2010 లో ప్రదానం చేసింది. సంస్కృత భాష లో నాటకాలు వేసి ఆయన ఆ భాషకి చేసిన సేవ కి గాను ఆ గౌరవం దక్కింది. కొంతకాలం సంస్కృత భాష లో వార్తలు కూడా చదివారు.
మోహన్ లాల్ నటించిన 350 కి పైగా సినిమాల్లో తప్పనిసరిగా చూడవలసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మళయాళం లో వచ్చిన తన్మాత్ర, వానప్రస్థం, భ్రమరం, కిరీడం, బాలెట్టాన్, కిరీడం, భరతం వంటి సినిమాలు ఆయన నటనా జీవితం లో ఆణిముత్యాలు లాంటివి. దృశ్యం పేరు తో వచ్చిన రెండు సినిమాలు అబాలగోపాలాన్ని అలరించడమే గాక,తెలుగు ఇంకా హిందీ లో కూడా రీమేక్ అయ్యాయి.ప్రస్తుతం దృశ్యం కి మూడవ ఎపిసోడ్ తయారవుతోంది. అదీ కూడా హిట్ అయి అందర్నీ అందర్నీ అలరించాలని కోరుకుందాం.